వచ్చే ఎన్నికల్లో కుటుంబ పాలన అంతం : డీకే అరుణ
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ సర్పంచులు, మండల, గ్రామ కమిటీల అధ్యక్షులు డీకే అరుణ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ అందితే జుట్టు లేకపోతే కాళ్లు అనేలా సీఎం కేసీఆర్ వ్యవహారశైలి ఉందని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నాయకులు ఇవాళ బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబ పాలన అంతం చేసేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారన్నారు. ఉద్యమ ఆకాంక్షలను కేసీఆర్ పక్కనబెట్టి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
తెలంగాణ ఏర్పడిన తరువాత కల్వకుంట్ల కటుంబం తప్ప మరెవరూ బాగుపడలేదు. ఇచ్చిన హామీల్లో ఓ ఒక్కటి నెరవేర్చలేదు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా కేటాయించలేదు. గ్రామ పంచాయతీల్లో సర్పంచులు అప్పులు చేసి పనులు చేస్తే కనీసం ఆ బిల్లులు చెల్లించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ప్రధాని మోదీ నాయకత్వంలో సర్పంచులందరూ గ్రామాలను అభివృద్ధి చేసుకునేలా ముందుకు సాగాలి అని అన్నారు.













