బీజేపీకే జనసేన మద్దతు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని బీజేపీకి మద్దతు ఇవ్వాలని జనసేన నిర్ణయించింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సమావేశమై చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్ నివాసంలో రెండు గంటలపాటు ఈ భేటీ జరిగింది. అనంతరం అగ్రనేతలు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని, బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని, తెలంగాణ ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని పవన్ విసృష్ట ప్రకటన చేశారు. ఏపీలాగే తెలంగాణ కూడా కలిసి పనిచేయాలని అనుకున్నాం. కానీ కరోనా, బిహార్, దుబ్బాక ఎన్నికల వల్ల సాధ్యం కాలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కొంత కన్ఫ్యూజన్ వచ్చిన మాట వాస్తవమే. ముందుగా మాట్లాడుకుని ఉండుంటే ఈ గ్యాప్ వచ్చేది కాదు. బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఈ నిర్ణయంతో మా కార్యకర్తలు నిరుత్సాహ పడింది నిజం. అయినా జన సైనికులు బీజేపీకి సహకరించాలి. ఒక్క ఒటు కూడా పక్కకు పోకుండా చూడాలని పవన్ పిలుపునిచ్చారు.
కాగా, తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందుకు అనుగుణంగా దుబ్బాకలో మొదటి అడుగుపడిందని, హైదరాబాద్‌లో కొనసాగబోతోందని చెప్పారు. ఈ మార్పునకు పవన్‌కల్యాణ్ పెద్ద మనసుతో అంగీకరించారని కిషన్‌రెడ్డితో పాటు లక్ష్మణ్ తెలిపారు. భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుందన్నారు.













