ఆ ప్రచారంలో నిజం లేదు : పట్నం మహేందర్ రెడ్డి
తాను పార్టీ మారుతున్నానంటూ జరిగే ప్రచారంలో నిజం లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తాండూరులో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో మంత్రి సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తనపై కాంగ్రెస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని, అలాంటి ప్రచారాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. మంత్రిగా తమ వాళ్లను గెలిపించుకునే బాధ్యత తనపై ఉందన్నారు. పైలెట్ రోహిత్ రెడ్డి గెలుపు కోసం పార్టీ సీనియర్ నాయకులంతా శ్రమిస్తున్నారని తెలిపారు. కొడంగల్లోనూ పట్నం నరేంద్ర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తాండూరు, వికారాబాద్లో కొంతమంది నాయకులు పార్టీ మారినంత మాత్రాన బీఆర్ఎస్కు ఎలాంటి నష్టం లేదన్నారు. కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగిలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.













