పాస్పోర్టు అపాయింట్మెంట్ ల తగ్గింపు
పాస్పోర్టు సేవా కేంద్రాలు (పీఎస్కే), పాస్పోర్టు లఘు కేంద్రాలు (పీఎస్ఎల్కే), పోస్టాఫీస్ పాస్ పోర్టు సేవా కేంద్రాల్లో (పీవోపీఎస్కే) పాస్పోర్టు కోసం చేసే దరఖాస్తుదారుల అపాయింట్మెంట్లను 75 శాతానికి తగ్గించినట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కోవిడ్ 19 పరిస్థితులు, కొత్త వేరియంట్లు పెరుగుతుండటంతో ఆయా కేంద్రాల్లో దరఖాస్తుదారుల రద్దీని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ నెల 27వ తేదీ వరకు ఇలాగే ఉంటుందని తెలిపారు. సికింద్రాబాద్లోని ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు ఉదయం 9:30 నుంచి 12:30 గంటల మద్య మాత్రమే రావాలని ఆయన సూచించారు.













