మెదక్ లో రూ.200కోట్లతో ఆహార పరిశ్రమ
మెదక్ జిల్లా తూప్రాన్‌లో అతి పెద్ద ఆహార (పుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమ రాబోతున్నది. ఈ రంగంలో దేశంలోనే ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపు రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కోల్‌కతా పర్యటనలో, గ్రూపు చైర్మన్ సంజీవ్ గోయెంకాతో సమావేశమయ్యారు. మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద 20 ఎకరాల్లో ఈ ఆహార పరిశ్రమను గోయెంకా గ్రూపు ఏర్పాటు చేయనున్నది. ఈ పరిశ్రమ ద్వారా ఈ-విటా, టూ-యమీమ బ్రాండ్లను తయారు చేయనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో తెలంగాణ రైతులకు సహకారం అదించాల్సిందిగా గోయెంకాను కోరారు. తమ ఉత్పత్తులను మార్కెట్ ధరకు అమ్ముకొనేలా స్థాని రైతుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేందుకు గోయెంకా గ్రూపు అంగీకరించింది.
తెలంగాణ ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో ఉన్న వనరులు, అవకాశాలను గుర్తించి రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చిన సంజీవ్ గోయెంకా గ్రూపునకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు వెయ్యిమందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి తెలిపారు.













