వ్యవసాయ పట్టభద్రులకు విదేశీ విద్యాసాయం

ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్వాన విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఇద్దరేసి విద్యార్థులకు అమెరికాలోని ఆబర్న్ విశ్వ విద్యాలయాల్లో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఓవర్సీస్ ఫెలోషిప్ ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఏటా వ్యవసాయ, ఉద్వాన విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ నాలుగో (ఆఖరి) సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో ఇద్దరు చొప్పున ప్రతిభావంతులను గుర్తించి వారికి రెండేళ్ల పాటు మాస్టర్స్ డిగ్రీ ఫెలోషిప్ ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. విద్యా ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్రంలో తొలిసారిగా ఈ నిర్ణయం తీసుకున్నామని, మూడేళ్ల పాటు ఈ పథకాన్ని కొనసాగిస్తామని తెలిపారు.