ఓయూ వీసీ రవీందర్ అమెరికా పర్యటన
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ ఉపకులపతిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కే సీతారామారావు వ్యవహరించనున్నారు. ఆయన ఓయూ ఇన్ఛార్జ్ వీసీగా జూన్ 19 వరకు కొనసాగనున్నారు. ఈ నెల 25 నుంచి జూన్ 19 వరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ డి రవీందర్ ఆమెరికాలో అధికారిక పర్యటన చేయనున్నారు. అమెరికాలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పూర్వ విద్యార్థులు (అల్యూమినీ)తో సమావేశం జరపనున్నారు. వారి సేవలను ఎలా యూనివర్సిటీ అభివృద్ధి కోసం వినియోగించుకోవాలనే అంశాలను చర్చించనున్నారు. అలాగే అమెరికాలోని పలు విద్యా సంస్థలు, యూనివర్సిటీలతో సహాయ సహకారాలు ఎలా తీసుకోవాలనే అంశాలపై కూడా వీసీ రవీందర్ చర్చించనున్నారు. ఓసీ వీసీ రవీందర్ అమెరికా పర్యటన ముగిసే వరకు ఓయూ ఇన్ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ సీతారామారావును కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













