ఉస్మానియా వర్సిటీ విద్యార్థులకు గొప్ప అవకాశం
భారతీయులు, అందునా సామాన్యులు విదేశాలకు వెళ్లి చదవడం, అక్కడ పరిశోధనలు చేయడమంటే మాటలతో అయ్యే పనికాదు. ఒకవేళ అలాంటి అవకాశం లభించినా దాన్ని అందిపుచ్చుకునేందుకు ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటి గొప్ప అవకాశం ఇప్పుడు ఉస్మానియా వర్సిటీ విద్యార్థులకు సులభవంగా లభించనున్నది. జపాన్ లోని షిబౌరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్ఐటీ)లో ప్రొఫెసర్‌గా, బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసి మురళీధర్ మిరియాల ఈ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థుల రాకపోకలకు జపాన్‌లో ఉండేందుకు అవసరమయ్యే నిధులను సమకూర్చేందుకు కూడా ముందుకొచ్చారు.
దీంతో విద్య, పరిశోధన, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పరం నైపుణ్యాలను మెరుగుపరుచుకుందుకు ఎస్ఐటీతో ఓయూ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తున్న ఓయూ వీసీ ప్రొఫెసర్ దండెబోయిన రవీందర్ యాదవ్, షిబౌరా సంస్థ అధ్యక్షుడు జన్ యమద ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. దీనిలో భాగంగా ఓయూ విద్యార్థులకు జపాన్‌లో ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు ఇవ్వడంతో పాటు ఎస్ఐటీ విద్యార్థులతో సంయుక్తంగా వర్క్‌షాప్‌లను నిర్వహిస్తారు.













