520వ అన్నమాచార్య ఆరాధన సందర్భంగా మూడు రోజుల సంకీర్తన సంబరాలు
ఈ మార్చి నెలలో 18, 19, 20 తారీఖున అన్నమాచార్య భావనా వాహిని (ఏ.బి.వి.) ఆధ్వర్యంలో అన్నమాచార్య ఆరాధనోత్సవాలు నిర్వహించారు.
మొదటి రోజు సందర్భంగా చిక్కడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయం నుంచి ట్యాంక్ బండ్ అన్నమయ్య విగ్రహం వరకు “మహా నగర సంకీర్తన” నిర్వహించటం జరిగింది.
ఇందులో భాగంగా అన్నమయ్య సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కన్నులపండుగగా ఊరేగించటం జరిగింది.
శ్రీ వెంకటేశ్వర స్వామి వేషధారణలో శ్రీ సాందీప్, అన్నమయ్య వేషధారణలో చి. అభిరామ్ పాల్గొన్నారు.
అనంతరం ట్యాంక్ బండ్ అన్నమయ్య విగ్రహం వద్ద ప్రఖ్యాత గాయకులు శ్రీ రామాచారి కొమండూరు గారు “వినరో భాగ్యము విష్ణు కథ”, శ్రీమతి వారణాసి శ్రీ సౌమ్య గారు “తెలిసితే మోక్షము”, శ్రీ సాందీప్ గారు “మతంగ పర్వతమాడ”, సాహితి “విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మా” సంకీర్తనలతో “సంకీర్తన గోష్టి గానం” కార్యక్రమంలో ఆకట్టుకున్నారు.
డా. శోభారాజు గారు మాట్లాడుతూ, “భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ” గురించి వివరించగా, ప్రముఖులు శ్రీ కె. వి. రమణాచారి గారు, ఐ.ఎ.ఎస్ (రిటైర్డ్), “భక్తితో స్వీకరిస్తే త్రాగే నీరు తీర్థం అవుతుందని, తినే పదార్థము ప్రసాదం అవుతుంది” అని తమ దివ్య సందేశాన్ని అందించారు.
శ్రీ మతి శైలజా గారు “అన్నమాచార్య భావనా వాహిని కోసం శోభారాజు గారి నిర్విరామ కృషి” గురించి తెలిపారు.
ఆద్యంతం శోభారాజు గారితో పాటు వారి శిష్య బృందం “అన్నమాచార్య భావనా వాహిని” విద్యార్థులు తమ తమ సంకీర్తనలతో ఉత్తేజ పరిచారు.
అదే రోజున సాయంత్రం మయూరి నాట్య బృందం స్వామికి నృత్య కైంకర్యం అందించారు.
రెండవ రోజు భాగంగా అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ డా. శోభారాజు గారి ఆధ్వర్యంలో అన్నమయ్య పురంలో “సంకీర్తన భావ తుషారం” అనే పేరుతో డా. శోభారాజు గారి శిష్యులు “ఆతని పాడెదము”, “ఘోర దురితములచే”, “ఆకాశమడ్డమా”, “చాలదా హరినామ”, “తెలిసితే మోక్షము”, “వినవమ్మ యశోద” అన్నమయ్య సంకీర్తనలు పాడి వినిపించగా వారు పాడిన ప్రతి అన్నమయ్య సంకీర్తనకు డా. గరికిపాటి నరసింహారావు గారు వ్యాఖ్యానం అందించారు.
ఈ సందర్భంగా డా. గరికిపాటి నరసింహారావు గారు మాట్లాడుతూ “అన్నమాచార్య సంకీర్తనకై డా. శోభారాజు గారు చేసిన నిర్విరామ కృషి గురించి ప్రశంసించారు.”
తదనంతరం పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు గారు పద్మశ్రీ పురస్కార గ్రహీత “డా. గరికిపాటి నరసింహారావు” గారికి “ధర్మ బోధ కేసరి” అను బిరుదుతో సత్కరించారు.
మూడవ రోజు భాగంగా “సంకీర్తన సుమం” అనే అంశంపై ఏ.బి.వి. విద్యార్థులు “తగున్నయా హరి నీకు”, “వాడల వాడల వెంట వాడెవో వాడెవో”, “తాళ్ళపాక అన్నమాచార్య”, “ఈ రూపమై ఉన్నాడు”, “వందేహం గురుదేవం”, “కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు”, “ఆది పురుషా”, “సిరుత నవ్వుల వాడే సిన్నెక”, “ఇంత చక్కని పెండ్లి కొడుకు” అన్నమయ్య సంకీర్తనలతో విశేషంగా ఆకట్టుకున్నారు. కాగా ఈ కార్యక్రమంలో శ్రీ వి. జగదీశ్వర్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ మూడు రోజులూ అతిథులుగా పాల్గొన్న వారిని, కళాకారులను డాక్టర్ శోభా రాజు గారు మరియు డాక్టర్ నంద కుమార్ గారు సత్కరించారు.
తదనంతరం హారతి, ప్రసాద వితరణతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.













