విదేశాల్లోని వారికీ తానా సహకారంతో.. ఎన్టీఆర్ స్మారక నాణేలు
ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణేలను ఇక వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం తానా సహకారం తీసుకోవాలని ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తానా ప్రతినిధులు, హైదరాబాద్ మింట్ (ప్రభుత్వ నాణేల ముద్రణ కేంద్రం) ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ మాట్లాడుతూ అమెరికాలోని వివిధ నగరాల్లో ఉన్న తెలుగువారు ఎన్టీఆర్ స్మారక నాణేలు కావాలని కోరుతున్నారని, వారందరికీ సులభంగా లభించేలా మింట్ అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరారు.
హైదరాబాద్ మింట్ సీజీఎం వి.నరసింహ నాయుడు, జాయింట్ డైరెక్టర్ గుండపునేడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందు కోసం ఇప్పటికే www.indiagovtmint.in వెబ్సైట్లో ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సైట్లో నాణేలు బుక్ చేసుకున్న ఇతర దేశాల వారికి తానా సహకారంతో వారి ఇళ్లకే పంపించేలా చూస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో ఎన్టీఆర్ సెంటినరీ కమిటీ అధ్యక్షులు టీడీ జనార్దన్, రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు, టీడీపీ అండమాన్ నికోబార్ అధ్యక్షుడు మాధవనాయుడు, దొప్పలపూడి రామ్మోహన్ రావు, మధు సూదన్ రాజు, భగీరథ, విక్రమ్ పూల, మండవ సతీష్ పాల్గొన్నారు.













