ప్రవాసీల సేవల కోసం.. దేశ, విదేశీ వ్యవహారాల్లో మార్పులు : మహేశ్ బిగాల
భారతదేశ అభివృద్ధితో పాటు, సవాళ్ల పరిష్కారంలో ప్రవాస భారతీయుల పాత్ర వెలకట్టలేనిది అని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. 1915, జనవరి 9న మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి తిరిగొచ్చిన సందర్భంగా ప్రతి ఏడాది ఈ రోజును ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ ప్రవాస భారతీయులు వివిధ దేశాల్లో కీలకమైన పదవులు, స్థాయిల్లో ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వారి నైపుణ్యాలను, సేవలను ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలన్నారు. అందుకుతగ్గ పరిస్థితులను భారతదేశ ప్రతినిధులు కల్పించాలన్నారు. ప్రవాసీల సేవలను ఉపయోగించుకునేందుకు దేశ, విదేశీ వ్యవహారాల్లో మార్పులను ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రవాస భారతీయుల కోసం నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు. దీని వల్ల దేశంలో సామాజిక, విద్య, వైద్య సదుపాయాలతో పాటు మౌలిక సౌకర్యాలు మెరుగు పడుతాయన్నారు. ఆర్థికంగా కూడా దేశం అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
50కి పైగా దేశాల్లో టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు చురుకుగా పని చేస్తున్నాయని మహేష్ బిగాల పేర్కొన్నారు. విదేశాల్లో ఉంటున్న తెలంగాణ బిడ్డలందరికీ ఎన్నారై శాఖలు అండగా ఉంటున్నాయని తెలిపారు. కరోనా సమయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేశామని మహేష్ బిగాల గుర్తు చేశారు.













