రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలి : మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలని, రాష్ట్రానికి చేయూతనివ్వాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కోరారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో బీఆర్ఎస్ యూఎస్ఏ కన్వీనర్ చందు తాళ్ల అధ్యక్షుతన జరిగిన ప్రవాస తెలంగాణవాసులు ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో తెలంగాణ స్వరూపం మారిపోయిందని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక దిగ్గజాలు క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. ఎదుగుతున్న తెలంగాణకు మట్టిబిడ్డల సహకారం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి కానుగంటి, టోని జాను, మోహిత్ కర్పూరం, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షుడు అనిల్ బందారం, ఉపాధ్యక్షుడు వెంకట్రెడ్డి కంచర్ల, తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఫ్లోరిడా అధ్యక్షురాలు మహతిరెడ్డి, నాట్స్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ తదితరులు పాల్గొన్నారు.













