ఎన్నారై యాష్ నిర్బంధంపై జయరామ్ ఆగ్రహం
అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన ఎన్నారై యాష్ బొద్దులూరిని ఎపి సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల ఎన్నారై టీడిపి కో ఆర్డినేటర్ జయరామ్ కోమటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన యాష్ బొద్దులూరిని శంషాబాద్ విమానాశ్రయంలో ఎపి సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాష్ పై లుక్ అవుట్ నోటీసు ఎపి సిఐడి జారీ చేయడంతో శంషాబాద్ పోలీసులు ఏపీ సీఐడీకి సమాచారం ఇచ్చారు. దాంతో ఏపీ సీఐడీ పోలీసులు యాష్ ను విమానాశ్రయంలో తమ అదుపులోకి తీసుకుని తరలించినట్లు సమాచారం. ఎపి సిఐడి పోలీసుల చర్యలను ప్రశ్నిస్తూ యాష్ ను వెంటనే విడుదల చేయాలని జయరాం కోమటి డిమాండ్ చేశారు. పలువురు ఎన్నారైలు కూడా ఈ దుశ్చర్యను ఖండించారు.













