ఉద్యమ సమయంలో ఓయూ గుర్తుకు రాలేదా?
ఉద్యమ సమయంలో రాహుల్ గాంధీకి ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు గుర్తు రాలేదని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పుడు రాహుల్ రావాలనుకోవడంలో ఉన్న ఉద్దేశ్యం ఏమిటని నిలదీశారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓయూను రణరంగంగా మార్చేందుకు యత్నిస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరు అన్ని సంఘాలు వారి స్థాయిలో పోరాటాలు చేశాయన్నారు. అయితే రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రతి ఒకరు కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి గర్వపడుతున్నారన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసం ఓయూని ఎంచుకొని రాహుల్‌ను తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.













