తెలంగాణలో వైద్య సేవలు బాగున్నాయి : ఎన్నారై హైమావతి
అమెరికాలో స్థిరపడిన ఓ మహిళ కాన్పు కోసం పుట్టింటికి వచ్చి ప్రభుత్వ దవాఖానలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన హైమావతికి ఐదేండ్ల క్రితం అమెరికాకు చెందిన వ్యక్తితో వివాహమైంది. యూఎస్‌లోనే ఉంటున్న ఆమె గర్భం దాల్చగా అక్కడి దవాఖానల్లోనే నెలనెలా పరీక్షలు చేయించుకొన్నారు. నెల క్రితం పుట్టింటికివచ్చారు. వేములవాడ ప్రభుత్వ దవాఖానలో సేవలు బాగున్నాయని బంధువులు, స్థానికులు చెప్పడంతో గత సోమవారం ఆమె ప్రసవం కోసం దవాఖానలో చేరారు. వైద్యులు సాధారణ కాన్పు చేయగా పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం వైద్య సిబ్బంది అందజేసిన కేసీఆర్ కిట్‌ను చూసి మురిసిపోయింది హైమామతి. ఇక్కడి వైద్య సేవలు భాగున్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె డిశ్చార్జి కాగా వైద్యులు సంతోష్‌చారి, స్టాఫ్ నర్సు భాగ్యలక్ష్మి తదితరులు ఆమెను దగ్గరుండి ఇంటికి పంపించారు.













