ఆన్లైన్ కాదు.. అందరూ రావాల్సిందే
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభంపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పాఠశాలల పున ప్రారంభంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఆన్లైన్ క్లాసుల నిర్వహణ లేదని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పాఠశాలకు రావాల్సిందేనని చెప్పారు. అందరి భాగస్వామ్యంతో పాఠశాలలను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 65 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు కానున్నట్లు తెలిపారు.
అధికారులు, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్యం బాధ్యత సర్పంచ్, కార్పొరేటర్, మేయర్లదేనని తేల్చి చెప్పారు. సంక్షేమ వసతి గృహాల్లో ఐసోలేషన్ గది ఏర్పాటుకు నిర్ణయించారు. విద్యార్థులకు కరోనా పరీక్షలు చేసి ఇంటికి పంపే ఏర్పాట్లపై చర్చించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. స్కూల్ బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో భౌతికంగానే తరగతులు జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













