ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే ఉంది
తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాజ్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శంషాబాద్లో హైవేల విస్తరణ పనులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. ప్రగతి సాధించాలంటే నీరు, కరెంటు, రహదారులు, కమ్యూనికేషన్స్ ప్రధానమని అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాలో 32 జిల్లాలకు జాతీయ రహదారుల అనుసంధానం జరిగింది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు డీపీఆర్ పూర్తయ్యింది. ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ఇంకా మిగిలే ఉందన్నారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేయటానికి మూడు నెలల్లో వస్తా అని అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి సాధించినట్లే అన్నారు. రింగ్ రోడ్డు కోసం భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నా. నేషనల్ హైవేల వెంట లాజిస్టిక్స్ పార్కులు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాములు, బీబీ పాటిల్, రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివారెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.













