తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కొత్తగా వచ్చిన కరోనా స్ట్రెయిన్ అలజడి నేపథ్యంలో ఇతర దేశాలతోపాటు మనదేశం కూడా అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలు కూడా ఈ కరోనా కట్టడికి చర్యలను చేపట్టడం ప్రారంభించాయి. ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూను ప్రకటించగా, తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్లో కర్ఫ్యూపై పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా.. పార్టీలు, మూకుమ్మడి సమా వేశాలు జరిగితే కొవిడ్ నిబంధనలు అమలయ్యే అవకాశాలు లేవని, ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల తరహాలో తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధిస్తే మేలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. హైదరాబాద్లో ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకల పార్టీలకు సన్నాహాలు జరుగుతుండగా, ఇవి కొనసాగితే..కట్టడిలో ఉన్న వైరస్ కేసుల సంఖ్య మళ్ళీ విజృంభించవచ్చన్న ఆందోళన నెలకొంది. ప్రభుత్వం కూడా దీనిని పరిశీలిస్తోంది. తెలంగాణలో కోల్డ్ వేవ్ కూడా మరోవైపు ప్రజలను వణికిస్తోంది. జనవరి 2వరకు రాత్రి కర్ఫ్యూ విధించాలన్న సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. నేడో, రేపో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.













