22న జీహెచ్ఎంసీ మేయర్‌గా విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్ నగర మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి ఈ నెల 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ రోజు మంచి ముహూర్తం ఉండటంతో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సిబ్బంది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులో చాంబర్‌ను సిద్ధం చేస్తున్నారు. బంజారాహిల్స్ నుంచి విజయలక్ష్మి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. మేయర్ విజయలక్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే కొనసాగింది. పాఠశాల విద్య హైదరాబాద్‌లోని హోలీ మేరి స్కూల్లో పూర్తి చేశారు. రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఇంటర్, భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం చేశారు. సుల్తాన్ ఉల్ లూమ్ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు.
గద్వాల విజయలక్ష్మి వివాహానంతరం ఆమె 18 ఏండ్ల పాటు అమెరికాలో ఉన్నారు. ఆ సమయంలో ఉత్తర కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో రిసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. 2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా భారీ విజయం సాధించారు. డివిజన్ అభివృద్ధికి తనవంతుగా కృషి చేశారు.













