ఎన్టీఆర్ ట్రస్టు సేవలు విస్తృతం : భువనేశ్వరి
స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రారంభించిన ట్రస్టు ద్వారా రెండు దశాబ్దాలుగా ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే గర్ల్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ (జీఈఎస్టీ) 2019 కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 100 మంది బాలికలకు రూ.95 లక్షల ఆర్థిక సాయం అందించామన్నారు. తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్థినుల్లో 25 మందిని ఎంపిక చేసి గండిపేటలోని ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో చదువుకునేందుకు ఉపకారవేతనాలను అందించనున్నట్లు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సీఈవో విష్టువర్థన్, విద్యావిభాగం సీవోవో వై.మోహన్రావు పాల్గొన్నారు. గెస్ట్ పరీక్షలో పాల్గొనేవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్టీఆర్టీయూఎస్టి. ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. హైదరాబాద్ గండిపేటలోని ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో డిసెంబరు 9న పరీక్ష ఉంటుంది. మరోవైపు కూకట్పల్లి బరిలో ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని గెలుస్తారనే నమ్మకం ఉందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఆమెకు అభినందనలు తెలిపారు. తాను ప్రచారంలో పాల్గొనడం లేదని తెలిపారు.













