తెలంగాణ కూడా దేశంలో భాగమే కదా : ఎంపీ నామా
తెలంగాణ పట్ల మోదీ సర్కారు వివక్ష చూపిస్తోందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ నవోదయ విద్యాలయాల కోసం ఎన్నో సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును మోదీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. తెలంగాణ కూడా దేశంలో భాగమే కదా అని నిలదీశారు. హర్ ఘర్ జల్ పథకం కింద అన్ని రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇస్తోంది. ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. పెద్ద రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంటింటికీ మంచినీరు ఇస్తోందా? అని ప్రశ్నించారు. సాగుకు 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ధాన్యం దిగుబడిలో పంజాబ్‌ను తెలంగాణ అధిగమించిందన్నారు.
రాష్ట్రానికి 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని 9 ఏళ్లుగా కోరుతున్నాం. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ఎన్నోసార్లు అడిగాం. కోచ్ ఫ్యాక్టరీలను మహారాష్ట్ర, గుజరాత్ ఇచ్చి మాకు రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చారు. తెలంగాణలో ట్రైబుల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరాం. తెలంగాణకు మెడికల్ కళాశాలలు, నవోదయ విద్యాలయాలు ఇవ్వట్లేదు. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది. చిన్న రాష్ట్రాల పట్ల మోదీ సర్కారు తీరు సరిగా లేదు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.













