మధుకాన్‌పై వచ్చిన ఆరోపణలు నిజం కాదు… నిజాయితీగానే ఉన్నా : నామా నాగేశ్వరరావు

ఈడీ దాడుల నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు స్పందించారు. మధుకాన్‌పై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని ప్రకటించారు. 40 సంవత్సరాల క్రితం మధుకాన్‌ను స్థాపించానని, ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను తాము పూర్తిచేశామని తెలిపారు. ముంబై నుంచి మగళూరుకు ప్రాజెక్టు చేశామని, చైనా సరిహద్దుల్లో కూడా మధుకాన్ తరపున రోడ్లు వేస్తున్నామని పేర్కొన్నారు. తాము ఎవర్నీ ఎక్కడా మోసం చేయలేదని, ఈ సంస్థను తను సోదరులు చూసుకుంటున్నారని తెలిపారు. కంపెనీల్లో ఎండీగా తాను లేనని అన్నారు. సీఎం కేసీఆర్, ఖమ్మం ప్రజలే తన బలమని, తానెప్పుడూ నిజాయితీగానే ఉంటానని ప్రకటించారు. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు పేర్కొన్నారని, తాను కచ్చితంగా విచారణకు హాజరవుతానని నామా నాగేశ్వర రావు ప్రకటించారు.
టీఆరెస్ ఎంపీ నామా నాగేశ్వర రావు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆయనకు సంబంధించిన మధుకాన్ గ్రూప్ సంస్థలతో పాటు మరో 5 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. లోన్ రూపంలో డబ్బులు తీసుకొని, వాటిని విదేశీ కంపెనీలకు ఆ డబ్బు మళ్లించారన్నది ఎంపీ నామాపై ప్రధాన అభియోగం. 1064 కోట్ల రూపాయల బ్యాంక్ ఫ్రాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నామా నివాసాల్లో ఈడీ సోదాలు చేసింది. నామా ఇళ్లు, ఆఫీసులతో పాటు “రాంచీ ఎక్స్ ప్రెస్ వే” సీఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్లు సీతయ్య, పృథ్వీతేజ నివాసాల్లోనూ ఈడీ సోదాలు చేంది. కంపెనీలకు సంబంధించిన కీలక ఫైళ్లను ఈడీ అధికారులు పరిశీలించారు. మరోవైపు 2019లోనే నామాపై సీబీఐ కేసు నమోదు చేసింది. మధుకాన్ ఇండస్ట్రీ ఆడిటర్లతో పాటు మరికొన్ని ఇండస్ట్రీ ఆడిటర్లను కూడా సీబీఐ తన ఛార్జిషీట్ లో నమోదు చేసింది.కొన్ని రోజులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఈ నెల 25 న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈయనతో పాటు మధుకాన్ కేసులో నిందితులందరికీ కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.