పబ్లిసిటికి దూరం- సేవే లక్ష్యం

అమెరికాలో ఉంటూ, ఉన్నతమైన ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహిస్తూ, తాము అభివృద్ధి చెందినట్లుగానే తమ ప్రాంతం, తమ జిల్లా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ 10 మంది కలిసి ఓ సేవా సంస్థను ఏర్పాటు చేసుకుని ఎక్కడా తమ పేర్లను తెలియజేయకుండా తమ సంస్థ ద్వారానే కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ జిల్లాను అభివృద్ధిపథంలోకి తీసుకెళుతున్నారు. నల్గొండ.ఆర్గ్ పేరుతో ఏర్పడిన ఈ సంస్థ 1989 నుంచి నేటివరకు జిల్లా అభ్యున్నతికి ఎంతో కృషి చేసింది. జిల్లాను ఎంతోకాలంగా పీడిస్తున్న ఫ్లోరైడ్ బాధ నుంచి విముక్తిని కలిగించేందుకు కృషి చేసింది. జిల్లాలో విద్య, వైద్యరంగ వికాసానికి కృషి చేసింది. ఈ కరోనా సంక్షోభ సమయంలో దాదాపు 2 కోట్ల రూపాయలను ప్రజలకోసం వినియోగించింది. కరోనా బాధితులకు అవసరమైన మందుల పంపిణీ, ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు, ఆక్సిజన్ సిలెండర్ల పంపిణీ వంటి వాటితోపాటు కోవిడ్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి నిత్యావసర వస్తువుల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలను కూడా చేసింది. కోవిడ్ 1, కోవిడ్ 2లో ఆ సంస్థ చేసిన సేవ ఎంతోమంది ప్రశంసలను అందుకుంది.
నల్గొండ జిల్లా తెలంగాణ ప్రాంతంలో వెనుక బడిన జిల్లాలలో ఒకటి. ఆ జిల్లాకు చెందిన ఎంతోమంది బాగా చదువుకుని ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్ళి, అక్కడే పెద్ద చదువులు చదివి, ఉద్యోగాలు చేసుకొంటూ స్థిరపడిపోయారు. తాము అమెరికాలో ఉంటున్న తమ మాతృరాష్ట్రం, తమ జిల్లాను మరవకుండా జిల్లాకు ఏదైనా చేయాలన్న తలంపుతో 1989లో నల్గొండ ఓఆర్‍జి పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. దీనినే నల్గొండ ఎన్నారై ఫోరంకూడా పేర్కొంటారు.
దాదాపు 23 సంవత్సరాలుగా పబ్లిసిటికీ పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం సేవే తమ లక్ష్యంగా పెట్టుకొని నల్గొండ.ఆర్గ్ ద్వారా వివిధ పనులను సేవలను దాదాపు 10 మంది కలిసి చేస్తున్నారు. ఈ పదిమంది ఎప్పుడూ, ఎక్కడా తమ పేర్లను చెప్పుకోలేదు. సంస్థ పేరు మీదనే సేవలను చేస్తున్నారు. దానికి వారిని అందరూ ఆభినందించాల్సిందే. ఈ రోజున కూడా ఈ నల్గొండ.ఆర్గ్ కి ఒక అధ్యక్షుడు, ఓ కార్యవర్గం అంటూ లేదు. ఎందుకంటే తమకు పదవులకన్నా జిల్లా అభివృద్ధే ముఖ్యమని వారు చెబుతూ, తమకు సేవ చేసే అవకాశం లభించడమే తమకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెబుతున్నారు. మాకు పర్సనల్‍గా పేరు కావాలని, పేరు తెచ్చుకోవాలని మేము ఎవరం ఆశించి పని చేయడం లేదు. మాకు జిల్లా అభివృద్ధి చెందాలి, మేము చేసే కార్యక్రమాలు ప్రజలకు చేరాలి, మా జిల్లా ప్రజలకు మా వలన మేలు జరగాలి అన్నదే తమకు ముఖ్యమని నల్గొండ.ఆర్గ్ లోని ఒక ముఖ్యమైన వ్యక్తి చెప్పారు. అదేవిధంగా ఈ సంస్థకి నల్గొండ జిల్లాలో గాని, ఇతర గ్రామాలలో కూడా ఎలాంటి కార్యవర్గం లేదు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా, ఇతర ఎన్‍జీవో సంస్థల ద్వారా మా కార్యక్రమాలను చేస్తున్నామని నల్గొండ.ఆర్గ్ పేర్కొంటోంది.
కోవిడ్ 1, కోవిడ్ 2 సమయంలో నల్గొండ జిల్లాతోపాటు, దాని చుట్టుప్రక్కల ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది. నల్లగొండలో, భువనగిరి ఇతర చోట్ల ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు, ఆక్సిజన్ సిలెండర్లు, అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఆక్సిజన్ అత్యవసరం ఉన్నవారికి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ అందించడం, ఆశ సిబ్బందికి మాస్కులు ఫేస్ షీల్డస్ శానిటైజర్స్, పిహెచ్‍సి డాక్టర్‍కి కోవిడ్ టెస్ట్ కిట్ లు, కోవిడ్ తో బాధపడుతున్న కుటుంబాల వారికి భోజనం అందించడం వంటివి చేశారు.
జిల్లాలో మంచినీటి సరఫరా
తెలంగాణ రాష్ట్రంలో, నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వాటర్ సమస్య అందరికి తెలిసిందే. నీటిలో ఉన్న ఈ ఫ్లోరైడ్‍ను తాగడం వలన చిన్నతనంలోనే లేదా, తరువాత గాని అంగవైకల్యం చెందిన ఎంతోమంది ఈ జిల్లాలో కనిపిస్తారు.. మొదటిసారి ఈ సమస్యపై నల్లగొండ ఓఆర్‍జి దృష్టి పెట్టింది. అనేక గ్రామాలలో కలుషితమైన నీటిని శుభ్రపరిచే ఆర్‍ఓ ప్లాంట్స్ పెట్టటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఏఏ గ్రామాలలో సమస్య జఠిలంగా ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ వచ్చింది. అమెరికా నుంచి అప్పటి న్యూజెర్సీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న చివుకుల ఉపేంద్రను నల్గొండ తీసుకువచ్చి, ఈ ఫ్లోరైడ్ కారణంగా ప్రజలు పడుతున్న కష్టాలు, ఆరోగ్య నష్టాలను ప్రత్యక్షంగా చూపించడంతోపాటు సమస్యను ఆయనకు వివరించి, ఆయన చేత అమెరికాలోని సెనెటర్లకు లెటర్ రాయించాము. అవిధంగా ప్రపంచ బ్యాంక్ దృష్టికి నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్యను తీసుకుని రాగలిగాము. ప్రపంచ బ్యాంక్ కూడా అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఫ్లోరైడ్ సమస్య నివారణ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసింది.
2004లోనే నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్య ప్రస్తావిస్తూ ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆంధప్రదేశ్ హైకోర్టు ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ జడ్జిమెంట్ ఇచ్చింది.
కేవీఎం డిగ్రీ కాలేజ్
నల్గొండ పట్టణంలో ఉన్న ఒకే ఒక కాలేజీ కొండూరు నర్సయ్య మెమోరియల్ డిగ్రీ కాలేజీ. 1981 లో శ్రీ కొండూరు నర్సయ్య గారు ఇచ్చిన 10 ఎకరాల స్థలంలో ఈ కాలేజీ ప్రారంభం అయ్యింది. ఆ కాలేజీ ప్రైవేట్ యాజమాన్యంతో ఉండి, సరైన వనరులు లేక ఆర్థిక ఇబ్బందులలో ఉంటే నల్గొండ.ఓఆర్‍జి ఆ కాలేజీలో తగిన సదుపాయాలు కల్పించడంతోపాటు, కాలేజీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళి ప్రభుత్వ కళాశాలగా గుర్తించాలని కోరుకుంటూ వినతిపత్రాలను సమర్పించింది. చివరిగా 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి ఆమోదంతో ప్రభుత్వ కళాశాలగా గుర్తించడం జరిగింది. ఈ విధంగా జిల్లాకు ఒక ప్రభుత్వ కళాశాలని తీసుకురావటానికి అనేక మందితో, అనేక సార్లు ప్రయత్నాలు చేసి చివరికి విజయం సాధించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంకొక 10 సంవత్సరాలు ఆ కాలేజీకి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తూ వచ్చింది. స్పోర్టస్ కాంప్లెక్స్ కు కావలసిన నిధులు, పెరిగిన విద్యార్థుల సంఖ్యతోపాటు కాలేజీలో మరికొన్ని గదులు కట్టించడం లాంటి అనేక సహయ కార్యక్రమాలను నల్గొండ ఓఆర్‍జి చేపట్టింది.
చెక్ డామ్ ల నిర్మాణం
నల్గొండ జిల్లాలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుందనీ, నాగార్జున సాగర్ డామ్ దగ్గరలోనే ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఆ నది వలన, జిల్లాలో అనేక గ్రామాలలో చిన్న చిన్న ఏరులు, పాయల్లో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ చిన్న చిన్న ప్రాంతాలలోని నీటిని వృథా కాకుండా చేయటానికి తాత్కాలికంగా ఆనకట్ట కట్టే విధానాన్ని చెక్ డామ్స్ అంటారు. నల్గొండ ఓఆర్‍జి ఈ విషయంలో కూడా జిల్లాలలోని అనేక గ్రామాలలో వచ్చిన సమాచారాన్ని పరిశీలించి ఆ గ్రామ ప్రజలతో మాట్లాడి, జిల్లా యంత్రాంగంతో, ఇంకా అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వంలోని అధికారులు, మంత్రులతో మాట్లాడి అవసరం అయిన చోట గ్రామాలలో నీరు నిలువ ఉండేలా ఆనకట్టలు (చెక్‍డామ్)కట్టే విధంగా అనేక చర్యలు చేపట్టింది. జిల్లా ప్రజలు, నల్గొండ జిల్లా అధికారులు కూడా నల్గొండ ఓఆర్‍జి పనిచేసిన విధానాన్ని ఇప్పటికీ మరవలేదు.
10వ తరగతి పిల్లలకు మెటిరీయల్
నల్గొండ.ఆర్గ్ సంస్థ మొదటి నుంచి విద్య, వైద్యం మీద తన దృష్టి పెట్టింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ, బీసీ విద్యార్థుల క్షేమం కోరి 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాలు తయారు చేసి, వాటిని ప్రింట్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో పంచె ఏర్పాటు చేసింది. ఈ ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాలు కూడా అక్కడున్న లేదా, హైదరాబాద్ టీచర్ల చేత తయారు చేయించి, జిల్లాలోని విద్యాశాఖ అధికారులకు చూపించి, వారి ఆమోదం తీసుకుని ప్రింట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేసింది.
ఈ కార్యక్రమం వలన 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం బాగా పెరగటం వలన మెల్ల మెల్లగా అన్ని పాఠశాలలు నల్గొండ.ఆర్గ్ ఇచ్చిన స్టడీ మెటిరీయల్‍కోసం ఎదురు చూసేది. ఈ కార్యక్రమం దాదాపుగా 15 సంవత్సరాల నుంచి జరుగుతోంది. ప్రస్తుతం 10వ తరగతి పాసై, ఇంజనీరింగ్ చేసి, మంచి ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువకులు కూడా జిల్లా అభివృద్ధికి పని చేయడం ప్రారంభించారు.
కెరీర్ ఎంచుకోవడంపై అవగాహన కార్యక్రమం
నల్గొండ.ఆర్గ్ చేపట్టిన మరోక ముఖ్యమైన కార్యక్రమం జిల్లాలోని విద్యార్థులకు తమ కెరీర్‍ను ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలన్న అంశంపై సరైన అవగాహనను కల్పించేందుకు ఓ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. నల్లగొండ జిల్లా వెనుక బడిన జిల్లా అవడం, గ్రామాలు ఎక్కువగా ఉండడం వలన అక్కడ ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య మీద సరైన అవగాహన లేదు. దీంతో నల్గొండ ఓఆర్‍జి ఇలాంటి విద్యార్థులకు ఉన్నత విద్యపై అవగాహన కల్పించడానికి అవసరమైన కార్యక్రమాన్ని చేపట్టింది. 10వ తరగతి విద్యార్థులకు ఏ సబ్జక్ట్ తీసుకుంటే ఏమి చదువ వచ్చు? ఎక్కడ ఎలాంటి కోర్సులు ఉన్నాయి? ఆ కోర్సులు చదవాలంటే ఎలా తయారవ్వాలి? ఏమి చదవాలి వంటి అనేక విషయాలను విద్యార్థులకు సులువుగా అర్థం అయ్యే పద్ధతిలో ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తోంది.
నల్గొండ.ఆర్గ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులకోసం హైదరాబాద్ నుంచి తెలిసిన వారిని, నిష్ణాతులను నల్గొండకు రప్పించి వారి చేత ప్రసంగాలను ఇప్పిస్తోంది.
జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డ్ లు
ఇదివరకు (15 సంవత్సరాల క్రితం) నల్గొండ, మిర్యాలగూడ లాంటి పట్టణాలు జాతీయ రహదారి పై ఉండడం వలన ఆ రహదారిపై ఎప్పడు ప్రమాదాలు జరగడం, అనేక మంది, ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుండేది. ఈ సమస్యను అర్థం చేసుకొన్న నల్గొండ ఓఆర్‍జి ఈ విషయంలో ప్రజలను చైతన్యవంతులను చేయడంతోపాటు వారికోసం, అందరికీ సులువుగా అర్థం అయ్యేలా హెచ్చరిక బోర్డులను తయారు చేయించింది. వాటిని పట్టణంలో అన్ని చోట్ల పెట్టి రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేసింది. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల పోయిన ప్రాణాలు, చితికిపోయిన జీవితాల వివరాలను ఫోటోల ద్వారా వివరించి ప్రజలను ఈ విషయంలో అప్రమత్తంగా ఉండేలా చైతన్యపరిచింది.