వైభవంగా నాగోబా జాతర ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతరను సోమవారం రాత్రి ఆదివాసీ గిరిజనులు మహా పూజలతో వైభవంగా ప్రారంభించారు. తెలంగాణలో మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత ఇదే పెద్ద జాతర. మెస్రం వంశ పెద్దలు, పూజారులు ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం నాగోబా దేవతను గర్భగుడి నుంచి బయటకు తీసుకువచ్చి గంగాజలంతో అభిషేకం నిర్వహించారు. తర్వాత మెస్రం వంశీయుల్లో ఏడుగురు దేవతను తిరిగి గర్భగుడిలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలకు మెస్రం వంశంలోని ఏడుగురు పెద్దలను తప్ప ఇతరులను అనుమతించలేదు. సోమవారం ఉదయం గిరిజన వాయిద్యాలతో నాగోబా విగ్రహాన్ని గ్రామంలోని మందిరం నుంచి ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. మహిళలు గంగాజలాన్ని కుండల్లో తీసుకువచ్చి మట్టితో పుట్టలు తయారు చేశారు. దేవాలయ పునరుద్ధరణ పనుల కోసం పాత ఆలయాన్ని కూల్చి వేయడంతో మూలవిరాట్టు చుట్టూ ఫెన్సింగ్తోపాటు పరదాలు కట్టి పూజలు చేశారు. రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ల నుంచి గిరిజనులు ఈ పూజల్లో పాల్గొన్నారు.













