ఘనంగా నాగోబా జాతర ప్రారంభం
ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే నాగోబా జాతర ప్రారంభమైంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబాకు మెస్రం వంశీయులు సంప్రదాయ పూజలు చేశారు. మర్రిచెట్టు విడిది సమీపంలోని కోనేరు నుంచి సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. నాగోబాను ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. దీంతో జాతర మొదలైనట్టుగా మెస్రం గిరిజన పెద్దలు ప్రకటించడంతో సందడి నెలకొంది. మహాపూజలతో అర్థరాత్రి వేళ ఘనంగా ప్రారంభించారు. పుష్యామవాస్య వేళ హస్తినమడుగు నుంచి తెచ్చిన పవిత్ర గంగా జలంతో నాగదేవుడిని అభిషేకించిన మెస్రం వంశస్తుల మహాపూజారి కటోడా హన్మంతరావు, మెస్రం వంశుస్తులు పటేల్ వెంకట్రావ్ నేతృత్వంలో మహాపూజ రాత్రి 11:40 గంటలకు అట్టహాసంగా ప్రారంభమైంది. మెస్రం వంశస్తులు అనాదిగా వస్తున్న తమ ఆచారం మేరకు మహాపూజలు నిర్వహించి జాతర ఉత్సవాలను ప్రారంభించారు.
అనంతరం కొత్త కోడళ్ల భేటీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బాజీ ఎంపీ గెడాం నగేశ్, కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఎస్పీ విష్టువారియర్ హాజరై నాగోబాను దర్శించుకున్నారు. వారికి మెస్రం వంశీయులు ఘనస్వాగతం పలికారు. ప్రధాన ఘట్టం మహాపూజ జాతర ప్రారంభమవడంతో ఆదివాసీలు పెద్ద ఎత్తున నాగోబా దర్శించుకునేందుకు బారులు తీశారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.













