కాంగ్రెస్ లోకి నాగం ?
తెలుగుదేశం పార్టీ మాజీ నేత, ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నా, క్రియాశీలకంగా లేని నాగం జనార్దన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి నాగర్ కర్నూలు నుంచి బరిలోకి దిగుతారని తెలుస్తోంది. 1999 నుండి మూడు వరుస ఎన్నికల్లో, ఆపై 2012 ఉప ఎన్నికల్లో నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి, దామోదర్ రెడ్డిలు ప్రత్యర్థులు ఢీకోనగా, ప్రతిసారీ నాగం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మారిన రాజకీయాల్లో భాగంగా ఇద్దరి మధ్య పరస్పర సహకారం కోసం ఒప్పందం కుదిరిందని, గతంలో దామోదర్ రెడ్డి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలిచేందుకు నాగం సహకరించారని తెలుస్తోంది. ఇద్దరమూ పోటీ పడకుండా, ఎవరో ఒకరు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలని ఇద్దరి మధ్యా ఢీల్ కుదిరిందని కూడా కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగం పార్టీ మారే విషయమై రోజురోజుకూ ఊహాగానాలు పెరుగుతూ ఉండగా, నియోజకవర్గంలో ఇంటింటికి పరిచయం ఉన్న తాను సులువుగా విజయం సాధిస్తానని నాగం ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగా ఉండటంతో త్వరలోనే ఆయన పార్టీ మార్పు తెరపైకి వస్తుదని తెలుస్తోంది.













