కాంగ్రెస్ లో చేరిన నాగం జనార్దన్ రెడ్డి, గద్దర్ కుమారుడు సూర్య
మాజీ మంత్రి, బిజెపి నాయకులు నాగం జనార్ధన్‌రెడ్డి, ప్రజాయుద్ధనౌక గద్దర్ కుమారుడు సూర్య పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఆధ్వర్యంలో ఏఐఐసీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ గాంధీ వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు వేములవాడ బిజెపి నేత ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
నాగం, సూర్య, ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ మాట్లాడారు. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమ నచ్చే పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. పార్టీని బలపరిచే నాయకులకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ కుమారుడు సూర్య ప్రత్యేక వ్యక్తిత్వం గల వారని కొనియాడారు. సూర్య కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషకరమైన విషయమన్నారు. బిజెపిపై దేశ ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని విమర్శించారు.
రాహుల్ గాంధీ లీడర్షిప్ నచ్చే పార్టీలో చేరుతున్నట్లు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసిన సోనియాగాంధీ పట్టుదలతో రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిందన్నారు. ఇచ్చిన మాటను సోనియాగాంధీ నిలుపుకున్నారని పేర్కొన్నారు.













