బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి.. శాంతిభద్రతల పేరుతో
బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక శాంతిభద్రతల పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారని ఆ పార్టీ నేత రామచందర్‌రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనర్ సిటీ పోలీస్ యాక్ట్ 30 అమలుకు ఉత్తర్వులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బీజేపీ సభ నిర్వహిస్తామని, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ ఏ కార్యక్రమం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం హౌస్ అరెస్టులు చేస్తోందన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేయవద్దని హౌస్ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. తెలంగాణలో ఎవరు మంటలు పెడుతున్నారో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ కుమార్తెను ఓడిరచారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ను నియోజకవర్గంలో తిరగనివ్వడం లేదన్నారు. తెలంగాణలో స్వేచ్ఛ పోయిందని, గుండాయిజం నడుస్తోందన్నారు. టీఆర్ఎస్ తెలంగాణలో మంటలు పెడుతోంది. మునుగోడులు బీజేపీలో చేరిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ పాదయాత్రలో ఒక్క చిన్న సంఘటన కూడా జరగలేదన్నారు. జనగామ జిల్లాలో ఓ మంత్రి కావాలని పాదయాత్రపై దాడి చేయించారు. అమిత్ షా, జేపీ నడ్డా వస్తే ఎందుకు భయపడుతున్నారు. ఆర్ట్స్ కళాశాలకు రూ.5 లక్షలు కట్టిన తర్వాత బహిరంగ సభకు అనుమతి లేదంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసు అధికారులపై బీజేపీ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటాం. పోలీసులు, అధికారులను సీఎం కేసీఆర్ ఉపయోగించుకుంటూనే, బీజేపీ ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటుందని అన్నారు.













