కారెక్కనున్న ముఖేష్?
మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మూల ముఖేష్‌గౌడ్ టీఆర్ఎస్లో చేరనున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. గత మూడున్నర ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్న ముఖేష్ ఎట్టకేలకు కారెక్కేందుకే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు నగరానికి చెందిన ఓ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాయబారం నడిపి చేరికకు లైన్ క్లియర్ చేయించినట్లు తెలుస్తోంది. గోషామహల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఊహాగానాల నేపథ్యంతో స్థానిక కార్యకర్తల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గోషామహల్ నియోజకవర్గం నుంచి ముఖేష్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ హయాంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేసిన ముఖేష్‌గౌడ్ 47వేల పైచిలుకు ఓట్లతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే గత సంవత్సర కాలం నుంచి ముఖేష్‌గౌడ్ టీఆర్ఎస్లో చేరుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతోంది.













