ఇది సభ్య సమాజం తలదించుకునే ఘటన.. తక్షణమే
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేందర్ను వెంటనే అరెస్టు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే కుమారుడు ఇంతటి దారుణానికి పాల్పడితే చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డికి మంచి పేరుందని అన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనలో నిందితుడైన రాఘవేందర్ను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయనను అరెస్ట్ చేసేలా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి మనవడిని ఒక మాట అంటే గగ్గోలు పెట్టిన సీఎంకు ఈ ఘటన కనపడడం లేదా? అని ప్రశ్నించారు.
చౌటుప్పల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల కారణంగా చాలా గ్రామాలు ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్ల నుంచి రసాయనాలతో కూడిన నీరు వస్తుండడంతో బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.













