పీకే గురించి కాదు.. కేసీఆర్‌ని ఎలా పీకాలన్నదే టార్గెట్
పీకే గురించి కాదని, కేసీఆర్‌ని ఎలా పీకాలన్నదే తమ టార్గెట్ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లాలో జరిగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గంలో కేంద్రమంత్రి గడ్కరీ అభివృద్ధి కార్యక్రమాలు ఉండడం వల్ల రేవంత్ కార్యక్రమానికి వెళ్లడం లేదని తెలిపారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పటిష్టంగా ఉందని వేరే నేత వచ్చి సమీక్ష జరపాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వీక్‌గా ఉన్న దగ్గర సమావేశాలు పెట్టుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.
ధరణి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ధరణి ఎత్తివేస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏం అభివృద్ధి చేశారని దేశం గురించి సీఎం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ పొత్తు అడిగినా ఏఐసీసీ హైకమాండ్ ఒప్పుకోలేదని తెలిపారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు సర్వ సాధారణమని తెలిపారు. పార్టీ మారే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ వచ్చే అంశంపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూసి కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.













