పార్లమెంట్‌కు కాదు… అసెంబ్లీకి కవిత?
వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ కవిత అసెంబ్లీకి పోటీచేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ స్థానానికి బదులుగా అసెంబ్లీకి పోటీచేస్తే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలుంటాయని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. కేంద్రమంత్రివర్గంలో టీఆర్ఎస్ చేరుతుందని, కవితకు కేంద్రమంత్రివర్గంలో ఛాన్స్ ఖాయమని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే కేంద్రమంత్రివర్గంలో చేరేందుకు టీఆర్ఎస్ నాయకత్వం సుముఖంగా లేకపోవడంతో, వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేయడం కంటే అసెంబ్లీ పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
2019 ఎన్నికల్లో బిజెపీతో పొత్తు ఉండే అవకాశాలు లేకపోవడంతో, మరోసారి టీఆర్ఎస్ కేంద్ర కేబినెట్లో చేరే అవకాశాలంతంతా మాత్రమేనంటున్నారు. దాంతో లోక్‌సభకు పోటీ చేయడం కంటే అసెంబ్లీకి పోటీ చేయడానికే కవిత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారన్న ప్రచారం ఇటీవల ఊపందుకుంది. 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేయడం ద్వారా కవిత రాష్ట్ర రాజకీయాలపై పట్టు పెంచుకొనే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో, మంత్రివర్గంలో కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. అయితే సోదరుడి దన్నుతో కవిత కూడా రాష్ట్ర రాజకీయాలపై పట్టును సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఏదైనా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుండి లేదా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుండి కవిత పోటీ చేసే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.













