ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎన్నారైలు కృషి చేయాలి : కవిత
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఎన్నారైలు కృషి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్రామానికి చెందిన ఎన్నారై, తెలంగాణ జాగృతి యూరప్ అధ్యక్షుడు దన్నమనేని సంపత్కృష్ణ సహకారంతో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ మేయర్ సర్దార్ రవీందర్సింగ్తో కలిసి ఎంపీ ప్రారంభించారు. పుట్టిన ఊరికి, పాఠశాలకు తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో సంపత్కృష్ణ పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటుకు సహకరించడం అభినందనీయమని చెప్పారు. రోజురోజుకు పుస్తకాలు చదివే సంస్కృతి తగ్గుతున్నదని తెలిపారు. ఈ లైబ్రరీ ఏర్పాటుతో పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందడం ఖాయమని పేర్కొన్నారు.
మానకొండూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రసమయి ఎంతగానో కృషి చేస్తున్నారని చెప్పారు. పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని, మంచి ఫలితాలను సాధించుకొంటున్నామని తెలిపారు. అనంతరం ఎన్నారై సంతప్కృష్ణ నివాసాని వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై యూరప్ అధ్యక్షుడు దన్నమనేని సంపత్ కృష్ణ, తెలంగాణ జాగృతి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.













