అరెస్టయిన విద్యార్థులను విడిపించండి : జితేందర్ రెడ్డి
అమెరికాలో అరెస్టయిన తెలంగాణ విద్యార్థులను విడిపించాలని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ యూఎస్‌కు చెందిన హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఫేక్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి విదేశీయులకు ఎర వేసింది. పే టూ స్టే పేరుతో విద్యార్థులకు వల వేసింది. ఈ ట్రాప్‌లో పడిన 600 మంది విద్యార్థుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్లలో తన నియోజకవర్గం మహబూబ్‌నగర్‌కు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారని.. తెలంగాణకు చెందిన విద్యార్థులు 129 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారని తెలిపారు. అది ఫేక్ యూనివర్సిటీ అని విద్యార్థులకు తెలియదని, వాళ్లు అమెరికాకు అక్రమంగా వెళ్లలేదని ఆయన సృష్టం చేశారు. ఇక్కడి పిల్లలు లక్షల రుణం తీసుకొని విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తారు. ఇండ్లు కూడా తాకట్టు పెట్టి విదేశాలకు వెళ్తారు. లోన్ తీర్చడం కోసమే చదువుకుంటూ చిన్న చిన్న పనులు చేస్తూంటారు. ఇప్పుడు వాళ్లను యూఎస్ నుంచి భారత్‌కు పంపించేస్తే వాళ్లను ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్లపై యూఎస్ ప్రభుత్వం పెట్టిన కేసులను ఉపసంహరించుకునేలా చేసి వాళ్లను భారత్‌కు తీసుకొచ్చి ఆదుకోవాలని కోరారు.













