తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదు : సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిరికివాడని, ఇలాంటి సీఎంను తానెక్కడా చూడలేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఈ సందర్భంగా అభినందించారు. ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడానికే తెలంగాణ గడ్డపైకి వచ్చినట్లు తెలిపారు. మీ బెదిరింపులకు భయపడే పార్టీ బీజేపీ కాదన్నారు. కేసీఆర్‌కు కలలో కూడా బండి సంజయ్ గుర్తొసున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోంది. కేసీఆర్ నేను కూడా సీఎంనే. నువ్వు రెండోసారి సీఎం కావొచ్చు నేను నాలుగోసారి సీఎంగా కొనసాగుతున్నా. మీలాగా సంస్కార హీనంగా వ్యవహరించడం లేదన్నారు. బీజేపీ అంటే బిర్యానీ అనుకున్నారా? డబుల్ బెడ్ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? వీటికి జవాబు ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ ప్రభుత్వాని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో ధర్మయుద్ధం మొదలైందన్నారు. అవినీతి, నియంత, కుటుంబ పాలనను అంతం చేసేందుకు సంజయ్ చేస్తున్న పోరాటం అభినందనీయం అన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, కాషాయ జెండా రెపరెపలాడుతుంది అని తెలిపారు.













