కేంద్రం అనుమతి ఇవ్వకపోతే..ఎలా ప్రారంభించారు : అరవింద్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన 9 మెడికల్ కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వానిది నయా పైసా లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కళాశాలల నిర్మాణం కోసం కేంద్రం నుంచి పూర్తి సహాయం అందిందన్నారు. ఇంకా పనులు, సౌకర్యాలు పూర్తి చేయకముందే ప్రారంభించారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తూన్నాయనే ఆదరా బాదరాగా కేసీఆర్ ప్రారంభించారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన గ్రాంట్స్తో 9 మెడికల్ కళాశాలలు ప్రారంభించారని తెలిపారు. దేశ వ్యాప్తంగా మోదీ తీసుకున్న పాలసీ వల్ల వైద్యుల సంఖ్య రెండిరతలు పెరిగిందన్నారు. తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, రాష్ట్రాన్ని బిక్షమెత్తుకునేలా సీఎం కేసీఆర్ తయారు చేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో ప్రొఫెసర్లు, సిబ్బందిపై కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేవని, రోగులను ఎలుకలు కొరుకుతున్నాయని తెలిపారు. పిల్లలను ఎత్తుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం మెడికల్ కళాశాలలకు అనుమతి ఇవ్వలేదని విమర్శించారని, కేంద్రం అనుమతి ఇవ్వకపోతే 9 మెడికల్ కళాశాలలు ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు.













