టీఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లి నర్సింహులు
నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మోత్కుపల్లి నర్సింహులుకు టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఈ సమాజానికి పరిచయం అక్కర్లేని వ్యక్తి మోత్కుపల్లి నర్సింహులు అని ప్రశంసించారు. మోత్కుపల్లి తనకు అత్యంత సన్నిహితుడని, ఆయనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని కొనియాడారు. తెలంగాణ సాధనలో అనేక అటుపోట్లు ఎదుర్కొన్నామని, ఆనాడు విద్యుత్ కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామని తెలిపారు. ప్రజా జీవితంలో మోత్కుపల్లికి ఒక స్థానం ఉందని, విద్యార్థి దశ తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు.
ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందించడమే కాకుండా అణగారిన ప్రజల గొంతుగా నిలిచి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సమాజం అంత్యంత దారుణమైన పరిస్థితులను అభవించిందని ఒకప్పటి పరిస్థితులను గుర్తు చేశారు. అప్పట్లో నర్సింహులు విద్యుత్‌శాఖ మంత్రిగా ఉండగా తనకు కలిసినప్పుడు కరెంట్ బాధలు ఉన్నాయని చెప్పారని, ఆలేరు అంతా కరవు ప్రాంతం. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చినా లాభం లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు మోత్కుపల్లి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.













