బీజేపీలో చేరిన మోత్కుపల్లి
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీ లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ కార్వనిర్వాహక అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీలు గరికపాటి మోహన్రావు, సుజనాచౌదరి పాల్గొన్నారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ నర్సింహులు నీతి, నిజాయితీగల వ్యక్తి అని, ముక్కుసూటిగా మాట్లాడే తత్వమున్న వారన్నారు. ఆయన చేరిక రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి ఉపయోగపడుతుందన్నారు. మోత్కుపల్లి మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ఎనిమిదో నిజాంగా మారి నిరంకుశ, అవినీతి, కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఆయన చేసే యాగాలు ఒట్టివేనని, కేసీఆర్ పాలన పోవాలని త్వరలో తాను యాగం చేస్తానని మోత్కుపల్లి తెలిపారు.













