యూఎస్ కాన్సులేట్ ఆధ్వర్యంలో.. వెబినార్

కరోనా విజృంభిస్తున్న వేళ ప్రతి ముస్లిం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ముస్లిం మత సంఘాల పెద్దలు పిలుపునిచ్చారు. హైదరాబాద్‍లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల జమాతె ఉలెమా-ఎ-హింద్ కార్యదర్శి ముఫ్తీ మహమూద్ జుబేర్ ఖాస్మీ మాట్లాడుతూ ఈసారి ముస్లింలు తమ జకాత్‍ను కొవిడ్ బారినపడ్డ వారికి చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మసీదులు, చర్చిలను కొవిడ్ సేవా కేంద్రాలుగా మార్చాలని మత పెద్దలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ పబ్లిక్ ఎఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయర్ మాట్లాడుతూ కోవిడ్ వల్ల బంధువులు, స్నేహితులతో కలిసి రంజాన్ జరపుకోలేకపోతున్నందుకు చింతిస్తున్నామన్నారు. పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ముక్తదర్‍ఖాన్ మాట్లాడుతూ అమెరికాలో మసీదులు, చర్చిలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లుగా మారాయని, ఇక్కడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అల్ మహద్‍అలీ- అల్ ఇస్లామిక్ మదర్సా, డిప్యూటీ డైరెక్టర్ మౌలానా ముఫ్తీ మహమ్మద్ ఉమర్ అబీదిన్ మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకోవడం మతానికి వ్యతిరేకం కాదని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్ నెలలో సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. మాస్కు విధిగా ధరించాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.