ఏ విచారణనైనా దైర్యంగా ఎదుర్కొంటాం : ఎమ్మెల్సీ కవిత
ఈడీ విచారణకు వంద శాతం సహకరిస్తాను, దైర్యంగా వచ్చి విచారణ ఎదుర్కొంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్ఫష్టం చేశారు. ఢిల్లీలో కవిత మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్ సిట్ ముందుకు ఎందుకు రావడం లేదు. సిట్ ముందుకు వచ్చేందుకు బీఎల్ సంతోష్‌కు భయమెందుకు అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు, బీజేపీలో చేరిన నేతలపై ఈడీ, సీబీఐ కేసులు ఉండవు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడులు, కేసులు పెడుతారు. తమ వైపు సత్యం, ధర్మం, న్యాయం ఉంది. ఏ విచారణనైనా దైర్యంగా ఎదుర్కొంటాం అని అన్నారు. మోదీ వన్ నేషన్ వన్ ఫ్రెండ్ స్కీమ్ అమలు చేస్తున్నారు అని మండిపడ్డారు. బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అవుతుంది.
మహిళా బిల్లు ఆందోళన అపగానే తనకు ఈడీ నోటీసులు ఇచ్చారు. వంట గ్యాస్ ధరలపై మరొకరు గళమెత్తితే వాళ్లకు కూడా ఈడీ నోటీసులు ఇస్తారు. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే దర్యాప్తు సంస్థలను పంపుతున్నారు అని కవిత ధ్వజమెత్తారు. నవంబర్, డిసెంబర్లో తెలంగాణలో ఎన్నికలు రావొచ్చు అని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానం. తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేయడమే బీజేపీ లక్ష్యం. తమ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేంద్రం లక్ష్యం చేసుకుంది. దర్యాప్తు సంస్థలతో తమపై దాడులు చేయిస్తోంది. ఈడీ, సీబీఐ, ఐటీ బెదిరింపులకు పాల్పడోంది అని తెలిపారు.













