దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాలి : ఎమ్మెల్సీ కవిత
మహిళా రిజర్వేషన్ల చట్టం అమలును కేంద్రం డీలిమిటేషన్‌కు ముడిపెట్టడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అనేక ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు. లండన్ పర్యటనలో ఉన్న ఆమె యూకేకు చెందిన నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని అసోసియేషన్ (ఎన్ఐఎస్ఏయూ) సభ్యుల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మహిళా రిజర్వేషన్లు, తెలంగాణ అభివృద్ధి, వ్యక్తిగత రాజకీయ జీవితం వంటి అంశాలపై కవిత తన అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళా రిజర్వేషన్లపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, తెలంగాణ స్థానిక సంస్థల్లో 55-57 శాతం మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నా, సమావేశాలు నిర్వహిస్తే వారి స్థానంలో ఎక్కువ సంఖ్యలో పురుషులే కనిపిస్తారన్నారు. ఈ విధానంలో మార్పుకోసం బీఆర్ఎస్ కృషి చేస్తోందని, మహిళా ప్రజాప్రతినిధులే పాల్గొనేలా దృష్టి పెట్టామని తెలిపారు.













