ఎంపీ అర్వింద్ ఆ హామీ ఏమైంది? : కవిత
అబద్దాలు చెప్పడం తప్ప బీజేపీ నేతలు చేసిందేమీ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అబద్దాలు చెప్పి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అభివృద్ధి ప్రజలు గమనించాలని కోరారు. గ్యాస్ పెట్రోల్, డీజిల్ ధరలు యథేచ్చగా పెంచారన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ మూడేళ్ల కిందట పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చారని గుర్తు చేశారు. అర్వింద్ ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉందని పసుపు బోర్డు ఎప్పుడు తెస్తారని ప్రశ్నించారు. నిజామాబాద్ ప్రజలకు ఏం జవాబు చెబుతారని నిలదీశారు. పసుపు విషయంపై స్పష్టంగా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పసుపుకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. ఆ విషయం ఏమైంది? పార్లమెంట్లో దీనిపై ఎప్పుడు మాట్లాడారు? ఈ మూడేళ్లలో ఎంపీ అర్వింద్ పార్లమెంట్లో ఐదుసార్లు మాట్లాడారు. ఆ సమయంలో పసుపు బోర్డు గురించి మాట్లాడలేదన్నారు.
మన పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ఢిల్లీ లో తాకట్టు పెట్టిన వ్యక్తి అర్వింద్. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలడి పొద్దు గడుపుతారు? ఎర్రజొన్నకు మద్ధతు ధర ఇస్తామన్నారు. అది ఏమైంది? రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్నారు. ఆ విషయంలో పురోగతి ఏది? వీటిపై నిజామాద్ ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. హామీల గురించి ప్రయత్నాలు చేస్తారేమో అని మూడేళ్లు విడిచిపెట్టాం. ఇక విడిచిపెట్టేది లేదన్నారు. మీరు ఢిల్లీ లో మోకాళ్ల యాత్ర చేస్తారో, మీ ఢిల్లీ నాయకుల వద్ద మోకరిల్లి పసుపు బోర్డు సాధించుకోని వస్తారో ఏం చేస్తారో చేయండి. బాండు పేపర్లో చెప్పినట్లు పసుపు బోర్డు పట్టుకొనే రండి. లేకపోతే ఏ గ్రామానికి పోనియా అడుగడుగునా నిలదీస్తామన్నారు. రూ.కోటి 92 లక్షలతో స్పైస్ బోర్డు తెచ్చి ఓ అపార్ట్మెంట్లో పెట్టారు దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదన్నారు.













