నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ ని స్థాపించండి : ఎమ్మెల్సీ కవిత
త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లి ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. నిజామాబాద్ ఐటీ హబ్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. అక్కడి రవాణా, నీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలతో పాటు శాంతి భద్రత గురించి కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు. రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు వేయించడానికి కృషి చేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీని తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు. రేపు నిజామాబాద్ ఐటీ హబ్‌ను సందర్శిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాజీరెడ్డి గోవర్దన్, షకీల్ కూడా పాల్గొన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లోని కేంద్రాల్లో సుమారు 3 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.













