ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ శాసనమండలిలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల పక్రియ ప్రారంభమైంది. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిధ్య వహిస్తున్న సభ్యుల పదవీకాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఆ స్థానాల భర్తీకి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి ఎన్నికల అధికారిగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అదనపు కమిషనర్, వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మండలి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 24న నామినేషన్లను పరిశీలించనున్నారు. 26వ తేదీ వరకు ఉపసంహకణ గడువు విధించారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.













