పార్టీ మారేందుకు సిద్ధమైన రాజయ్య..!
అసెంబ్లీ ఎన్నికల ముంగిట తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసేసింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాయి. బీఆర్ఎస్ లో టికెట్లు దక్కించుకున్న నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లిపోయారు. టికెట్లు దక్కని నేతలు పక్కచూపులు చూస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీ అయితే బాగుంటుంది.. ఏ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. లాంటి అంశాలను బేరీజు వేసుకుంటున్నారు. సరైన సమయం చూసుకుని జంప్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. బీఆర్ఎస్ టికెట్ దక్కని స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.
స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ రాజయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను కాదని ఈసారి మాజీ మంత్రి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు కేసీఆర్. అప్పటి నుంచి రాజయ్య వర్గం రగిలిపోతోంది. టికెట్ దక్కలేదని రాజయ్యో భోరున విలపించారు. అసలు కడియం శ్రీహరి దళితుడు కాదని.. అలాంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని రాజయ్య వర్గం ప్రశ్నిస్తోంది. తనకు టికెట్ దక్కలేదని రాజయ్య.. తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నిత్యం స్టేషన్ ఘన్ పూర్ లో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది ఆయన వర్గం. తనను కాదని టికెట్ దక్కించుకున్న కడియం శ్రీహరిని ఓడిస్తామని రాజయ్య వర్గం శపథం చేస్తోంది.
టికెట్ ఇవ్వలేకపోవడంతో కేసీఆర్ తనను పిలిచి మాట్లాడతారని రాజయ్య భావించారు. కానీ అలా జరగలేదు. రాజయ్యను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేయలేదు. అయినా ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ వస్తున్నారు. తాజాగా కడియం శ్రీహరితో కలసి వేదికను కూడా పంచుకున్నారు. దీంతో వాళ్లిద్దరి మధ్య విభేదాలు సమసిపోయాయని.. ఇద్దరూ కలిసి పని చేస్తారని బీఆర్ఎస్ వర్గీయులు భావించారు. అయితే సాయంత్రానికి సీన్ మారిపోయింది. రాజయ్య.. కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్ రాజనర్సింహతో భేటీ కావడం సంచలనం సృష్టించింది.
హన్మకొండలో జరిగిన దళిత మేధావుల సమావేశానికి ముందు.. దామోదర రాజనర్సింహతో రాజయ్య భేటీ అయ్యారు. వాళ్ళిద్దరూ కాసేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. వాళ్లిద్దరి మధ్య తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాజయ్య ప్రయత్నిస్తున్నారని.. అందులో భాగంగానే రాజయ్య దామోదర రాజనర్సింహతో భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ లో ఇక తనకు స్థానం లేదనుకున్న రాజయ్య.. పార్టీ మారేందుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇస్తే పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. బీజేపీపై ఆయనకు సదభిప్రాయం లేదు. అందుకే కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకుని కడియం శ్రీహరిపై పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.













