వారికి టికెట్లే కాదు.. ఏ పదవులూ ఇవ్వబోము : ప్రేమ్ సాగర్

గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇకపై మద్యపానం చేయబోమని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞను ఉల్లంఘించే వారికి స్థానిక సంస్థలో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. టికెట్లే కాదు, ఏ పదవులూ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు మద్యం సేవించమని, మాదకద్రవ్యాలు తీసుకోమని ప్రమాణం చేశారు. గాంధీజీ కన్న కలల సాకారం చేయడానికి మద్యానికి దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా జీవనం సాగిస్తామన్నారు. వర్గ విభేదాలు, కులమత తేడాలు, కక్షలు, గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తామని నేతలు తెలిపారు.