దాని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు.. ఈటల కీలక వ్యాఖ్యలు
సింగరేణిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణిని రూ.10వేల కోట్ల అప్పులోకి కేసీఆర్ ప్రభుత్వం నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిపై కేసీఆర్ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చేనాటికి సింగరేణి 3,500 కోట్ల డిపాజిట్‌తో ఉంది. నేడు రూ.10 వేల కోట్ల అప్పుల పాలైంది. సింగరేణికి జెన్కో రూ.20 వేల కోట్ల అప్పు బకాయిపడింది. నేడు సింగరేణిలో ఉద్యోగులకు ప్రతీనెల జీతం ఇవ్వాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంత ఉన్నతంగా ఉన్న సింగరేణి నేడు ఎందుకు అప్పులపాలైందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ తాను సింగరేణిని ఏదో చేస్తానని అప్పులు పాలు చేశారని ఆరోపించారు.
తెలంగాణ వచ్చేనాటికి 63 వేల మంది ఉద్యోగులతో సింగరేణి కళకళలాడిరది. నేడు 43 వేల మంది ఉద్యోగులకు పడిపోయింది. సింగరేణి పెరిగిందా? తగ్గిందా? 55 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి పెరిగింది. బొగ్గు ఉత్పత్తి పెరిగింది. కానీ ఉద్యోగులు తగ్గారు. 90 శాతం పనులను ప్రైవేటు కార్మికులకు అప్పగిస్తున్నారు. కోల్ ఇండియాలో ఒక్కో కార్మికుడికి 9 వందలకు పైగా ఇస్తున్నారు. సింగరేణి కార్మికుడికి 430 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. సింగరేణి కంపెనీ ఏఎంఆర్ సంస్థకు కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. దాని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. కేసీఆర్ అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు.













