జిల్లా కలెక్టర్ లతో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్
తెలంగాణలోని ప్రైవేట్ టీచర్లకు అందించే సాయంపై మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీసీ శాఖా మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. సాయం సంక్రమంగా అందే విషయంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల నుంచే ప్రైవేట్ టీచర్లకు సాయం అందించాలని నిర్ణయించారు. ఇందుకు నెలకు 42 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆర్థిక శాఖతో పాటు పౌరసరఫరాల శాఖ కూడా తమ కార్యాచరణను సిద్ధం చేసుకుంది. దాదాపు 1.45 లక్షల మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో బోధకులుగా పనిచేస్తున్నారని, వారందరికీ రేషన్ దుకాణాల వారీగా లబ్ధిదారులను గుర్తించాలని మంత్రులు జిల్లా కలెక్టర్లకు సూచించారు. కరోనా కారణంగా తాత్కాలికంగా మూతపడ్డ ప్రైవేట్ పాఠశాలల సిబ్బందికి కేసీఆర్ శుభవార్త చెప్పారు. తాత్కాలిక మూసివేతతో ఇబ్బందిపడుతున్న ఉపాధ్యాయులకు 2 వేల రూపాయలు, 25 కిలోల బియ్యాన్ని అందిస్తామని ప్రకటించారు. గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంక్ అకౌంట్ వివరాలతో జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.













