ఎట్టి పరిస్థితుల్లో వాటిని అమలు చేస్తాం.. మంత్రి ఉత్తమ్
ఆరు గ్యారంటీలపై హామీ ఇచ్చి ఎన్నికలకు వెళ్లామని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు ప్రజాపాలనపై నిర్వహించిన అవగాహన సదస్సు మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరిస్తాం. కొత్త రేషన్ కార్డుల జారీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రేషన్ కార్డులు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. పారదర్శకంగా విధులు నిర్వర్తించాలి. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులన్నీ స్వీకరించాలి. ఎట్టి పరిస్థితుల్లో తిరస్కరించ వద్దు. లబ్ధిదారుల అర్హత అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం ఇది. వారి ఆశయాలకు అనుగుణంగా అధికారులు పని చేయాలి. ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఆగ్యోశ్రీలో భాగంగా వైద్య ఖర్చులకు రూ.10 లక్షలకు పెంచాం. మరో నాలుగు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. పదేళ్ల తర్వాత అవకాశం వచ్చిన దృష్ట్యా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు.













