Minister Uttam : మీకు భయమైతే చెప్పండి… నేను సంతకం చేస్తా : మంత్రి ఉత్తమ్
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనులు వేగంగా పూర్తిచేసేలా ఒప్పందాలు పూర్తి చేయడంలో ఎందుకు వెనకాడుతున్నారు. మీకు భయమైతే చెప్పండి దస్త్రాలపై నేను సంతకం చేస్తా అంటూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సచివాలయంలో శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జా (Rahul Bojja), నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఇతర ఇంజినీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సొరంగం ప్రవేశం, వెలుపలకి వచ్చే మార్గాల్లో టన్నెల్ బోర్ యంత్రానికి బదులు అడ్వాన్స్డ్ టెక్నాలజీ విధానం ద్వారా తవ్వకాలు చేపట్టాలని, నిధుల చెల్లింపునకు ఎస్క్రో ఖాతా తెరవాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఖాతా తెరవడానికి అవసరమైన సంతకాల విషయంలో నిర్మాణ సంస్థ తమ ప్రతినిధుల పేర్లు సక్రమంగా ఇవ్వడం లేదని, తాము ఎలా ముందుకు వెళ్లగలమని ఇంజీనర్లు (Engineers) ప్రస్తావించినట్లు తెలిసింది. దీంతో స్పందించిన మంత్రి భయం ఉన్నోళ్లు వెళ్లిపోండి. నేను సంతకం (Signature) చేస్తా అంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పనులు మొదలు పెట్టేందుకు నిర్మాణ సంస్థ తక్షణం రూ.35 కోట్లు అడుగుతున్నట్లు సమాచారం.






